30, డిసెంబర్ 2021, గురువారం

GODADEVI ANDALPASURAMULU|గోదాఆండాళ్పాశురములు తెలుగుసీసపద్యంలో,#GODAPASUR...


సీ.శుకశాబకమనీవు సుఖనిద్రనుంటివా
ఎన్నాళ్ళునీనిద్రనెరుకపరచు
మాటచాతుర్యమునోటివాడితనము
యెరిగివచ్చితిమమ్మ ,యెంతనటన
మాటకారులుమీరె మంచివారలుమీరె
అందరూవస్తిరా అతివలార!
మత్తగజముపాలి ,మానర సింహుని
శత్రుసూదనుకీర్తిచక్కపాడ

ఆ.వె.వచ్చిచేరినారు పరిపూర్ణరూపిణీ
నిదురలేచిరమ్ము నీలవేణి
అనుచువాదకరణి నార్తిధ్వనింపగ
గోపవనితలెల్ల కోరిపిలచె.

సీ..
మృదులమౌ లేచిల్క మధురకంఠముదాన
నిదురేల లేవమ్మ మదిరనయన
సద్దుచేయక మమ్ము బుద్ధిగా నిలుమని
మందలించెడు నట్టి సుందరాంగి
వచ్చుచుంటీనంచు వాదమ్ములేసేయు
నోటిదురుసుదాన మాటకారి
అందరూ వచ్చిరా యననేలనే సఖీ
లెక్కించుకొనరాదె చక్కనమ్మ
తే.గీ...
కువలయమ్మను గజమును గూల్చువాని
కరుణవృష్టిని గురిపించు పురుషవరుని
హరిని గీర్తించి వ్రతమును నాచరించ
జాగుసేయక రావేల జలజనయన.!!!

27, డిసెంబర్ 2021, సోమవారం

GODADEVI ANDALPASURAMULU|గోదాఆండాళ్పాశురములు తెలుగుసీసపద్యంలో,#GODAPASUR...


తిరుప్పావై-పాశురం 12
రచన డా.వేదాల గాయత్రిదేవి

సీ.యెనుములసిరములనెనలేనిధారలై
కురిసేటిపాలనుకోర్కెజూచి
పంకమగ్నమ్మగు పావనగృహములో
ద్వారవాకిలిపట్టి దరినినిలచి
రావణసంహారు రామునినామము
కీర్తింప వచ్చినీ.,గీముకడకు
నిలచియుంటిమిభామ ,నిదురనువీడుమా
శ్రీదాముసోదరీ ,సిరులతల్లి.
ఆ.వె.ప్రణవమంత్రమహిమ పాలధారలుకాగ
మహితరామమంత్రమననజేయ
భక్తిధనమెతొడవు భాగవతులకని
తెలిసివచ్చినాము.,చెలియలెమ్ము.

రచన ఆకుండి శైలజ
సీ.....
తమదూడలేపాలు త్రాగుచున్నాయని
ఏకధారగపాలు నెనుములొదల
నేలంత బురదయు నీహారమె శిరను
నినువీడి పోలేక నిలచినాము
భార్యనే చెరబట్టు బంతిమోములదొరన్
సంహారమొనరించు సద్గుణుండు
శ్రీరామ గానమ్ము శ్రీకరమ్ముగ చేయ
పరవశించిరిగాదె నిరుగుపొరుగు
తే.గీ...
సతము కష్ణుని విడలేని సఖుని, సహజ
యింత గాటంపు నిదురయే యేలనమ్మ
వేగరావమ్మ గడపలో వేచినాము
అనుచు ప్రియమార పిలిచెను అతివగోద.!!!


24, డిసెంబర్ 2021, శుక్రవారం

GODADEVI ANDALPASURAMULU|గోదాఆండాళ్పాశురములు తెలుగుసీసపద్యంలో,#GODAPASUR...


గానం.. శ్రీమతి మోచర్ల పద్మనాభ కస్తూరి
రచన డా.వేదాల గాయత్రిదేవి
తిరుప్పావై-పాశంరం 9

సీ.మేలిరతనమేడ మేలైనరత్నమా!
మాయత్తకూతురా!మంచిదాన
బంగారుదీపాలభాస్వద్విలాసము
ధూపపరిమళమ్ముతోడుకాగ
మంచితల్పమునందు మత్తుగానిద్రించు
మాణిక్యమంజరీ!మహిమదాన
నిదురనుచాలించు ,నీదైనభవనపు
మణులతలుపుతీయి ,మంజుగాత్రి!
ఆ.వె.అత్త!లేపునీదుననుగు కూతునిపుడు
మూగచెవిటియౌనె?మొద్దుయగునె?
మధురనామధేయు మాధవుకీర్తింప
లేపిపంపునీదు ,లేమనిపుడు.

రచన శ్రీమతి ఆకుండి శైలజ
9 వ పాశురము
సీ....
మేలైన మణులతో లీలగా సృజియించు
మేడలో పవళించు మీననేత్రి
అగరుధూపపు తావి హత్తుకొనెనా యేమి
శ్రీకృష్ణుడే నన్ను చేరునంచు
హంసతూలికపైన హాయిగా నిదురించు
మామకూతుర లెమ్ము మరులుకొనక
తమ్మికెంపుల నద్దు తలుపు తీయగతాను
మేనత్త నీవైన మేలు కొల్పు.
తే.గీ...
ఎంత పిలచిన పలుకదే యేమి వింత ?
చెవిటిమూగయు కాదుగా చెలియలార !
మంతిరించిర యెవరైన, మగత వీడి
చెలియ రావేమి శ్రీకృష్ణ సేవజేయ..!!!

23, డిసెంబర్ 2021, గురువారం

GODADEVI ANDALPASURAMULU|గోదాఆండాళ్పాశురములు తెలుగుసీసపద్యంలో,#GODAPASUR...

గానం శ్రీమతి మోచర్ల పద్మనాభ కస్తూరి గారు
రచన శ్రీమతి డా. వేదాల గాయత్రి దేవి గారు

తిరుప్పావై-పాశురం 8

సీ.తూరుపుతెలవారె తోయజమిత్రుడు
ఉదయగిరినిచేరనుద్యమించె
మేతకొరకుపోవుమేలైన యెనుములు
తమముపోయిన ,రీతితరలిపోయె
కేశినోటినిచీల్చి.,కేశిసూదనుడైన
చాణూరముష్టుల ,సంహరించు
కృష్ణనామమ్మును కీర్తించినోరార
పాడికొలుతుమమ్మ ,పడతిలెమ్ము

తే.గీ.సత్త్వగుణదాత ,శాస్త్రార్ధ సారమతడు
రాజతామససంహారి ,రాజసముడు
సాధురక్షణశీలుని.సన్నుతింప
దేవదేవునిపొందెడి ,తీరునిదియె.

రచన శ్రీమతి ఆకుండి శైలజ గారు
* 8 వ పాశురము*
సీ....
ఆకాశమంతటా అన్నిదిక్కులలోన
అరుణోదయంబయ్యె నదివొ గనవె
 గోశాలలన్ వీడి గోకులంబంతయు
గ్రాసమ్ము మేయగ కదలుచుండె
కృష్ణునే కీర్తించు తృష్ణతో గోపికల్
వెడలుచుండెను చూడు వేడ్కతోడ
చాణూర మల్లుల సంహరించెడు వాని
సేవించ వలె సఖీ చేర రావె...!!!

తే.గీ....
శీఘ్రముగ లేచి రావేమి చిన్నదాన
వాసుదేవుని గీర్తించ వరము లిడును
పొందగ పఱైని శుభముగ నందరమును
జాగు సేయక రావమ్మ జలజనయన.!!!

22, డిసెంబర్ 2021, బుధవారం

|GODADEVI ANDALPASURAMULU|గోదాఆండాళ్పాశురములు తెలుగుసీసపద్యంలో,#GODAPASU...

శ్రీమతి మోచర్లపద్మనాభకస్తూరి గారు గానం చేసిన
డా.వేదాల గాయత్రిదేవి గారు రచించిన
తిరుప్పావై-పాశురం 7

సీ.ఏటిరింతలుకల్సి యేమేమొమాటల
నూసులాడెనదియె నువిదలెమ్ము.
దధిమధనమ్మున తడవతడవకును
గలగలధ్వనియించు ,గాజులవియె
స్రస్తవేణీబంధసౌగంధలహరుల
గొల్ల భామజడను ,కుసుమచయము
కేశిసూదనుహరికీర్తించువేళల
నారాయణుని దివ్య నామమరసి
ఆ.వె.రూపగుణవిభవరోచిష్ణుకృష్ణుని
పాపచయవిదూరు పరమపురుషు
వేదశాస్త్రవినుతు ,విశ్వేశుకీర్తింప
వేగలేవవమ్మ ,వేకువయ్యె.

శ్రీమతి ఆకుండి శైలజ గారి రచన

7 వ పాశురము
సీ....
తెల్లవారుచునుండె దినకరుండుదయించె
పక్షుల కిలకిలల్  పలుకరించె
సుదతుల కంఠాల సూత్రాల సవ్వడుల్
కరముల కడియాల స్వరము లవియె
గొల్లభామలు చిల్కు చల్ల రావంబులు 
మంజులమ్ముగ తాకె మానసముల
మాకందరకు నీవు మంచి నాయికగాదె
హరికీర్తనము జేయ తరలిరావె
తే.గీ....
ప్రొద్దు పొడుపున నాదాలు పొలతి వినవె
శయ్యపైనుండి దిగనీకు శ్రమ మదేమి
ఆలకించుచు నన్నియు నేల మగత
తలుపు దీయంగ రావేమి తలిరుబోడి!!!